కేంద్ర ప్రభుత్వ కొత్త టోల్ పాలసీని అందుబాటులోకి తీసుకునిరానుంది. ఇందుకోసం రెండు రకాల్లో చెల్లింపులు చేయవచ్చు. ఒక్కసారి రూ.3 వేలు చెల్లిస్తే యేడాది మొత్తం ఫ్రీగా టోల్ పాస్ చేసే అవకాశం కల్పించింది. అలాగే, వంద కిలోమీటర్లకు రూ.50 ఫిక్స్ అమౌంట్ టోల్ ఫీ చెల్లించే విధానాన్ని కూడా తీసుకునిరానుంది.
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జితో ఇబ్బందులు పడే వాహనదారులకు ఇది నిజంగానే శుభవార్తగా చెప్పుకోవచ్చు. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది.
తాజా ప్రతిపాదనలో భాగంగా, వాహనదారులు త్వరలో రూ.3 వేల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు. తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌లు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌లపై పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు. కొత్తగా తీసుకురానున్న ఈ పథకంలో రెండు చెల్లింపు విధానాలను తీసుకురాబోతున్నారు.
ఇందులో మొదటిది వార్షిక పాస్. దీనికి ప్రతి సంవత్సరం రూ.3 వేల ఫ్లాట్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు టోల్ రోడ్లపై అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది.
రెండవది దూరాన్ని బట్టి పాస్ తీసుకునే సౌకర్యం. ఈ పథకం కింద వాహనదారులు వంద కిలోమీటర్లకు రూ.50లు నిర్ణీత నగదు చెల్లిస్తారు. దీనికి అదనపు ధ్రువపత్రాలు కూడా ఏమీ అవసరం లేదు.