Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Advertiesment
pawan kalyan

ఠాగూర్

, బుధవారం, 28 మే 2025 (10:54 IST)
సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కల్పిస్తున్న సౌకర్యాలపై విచారణకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే అధికారులు థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు మొదలుపెట్టారు. ముఖ్యంగా, తూర్పోగోదావరి జిల్లాలో ఈ తనిఖీ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో థియేటర్ యజమానులు వణికిపోతున్నారు. 
 
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు.. కాకినాడ సినిమా రోడ్డులో ఉన్న చాణక్య, చంద్రగుప్త థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వోలు, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ, కాకినాడ రూరల్ ఎమ్మార్వోలు పాల్గొన్నారు. 
 
రాష్ట్రంలోని సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా మార్చి, ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సినిమా హాళ్ల బంద్ ప్రకటన నేపథ్యంలో, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తమ శాఖ చేపట్టిన చర్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు కీలక సూచనలు చేశారు.
 
సినిమా హాళ్లలో టికెట్ ధర కంటే పాప్‌కార్న్, ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి మంచినీళ్ల సీసాల ధరలు కూడా అధికంగా ఉండటంపై సమావేశంలో చర్చించారు. వీటి వాస్తవ ధరలు, ప్రస్తుత విక్రయ ధరలు, నాణ్యతా ప్రమాణాలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ధరల నియంత్రణ చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలో గుత్తాధిపత్యం కొనసాగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి ఆయన సూచించారు.
 
కుటుంబ సమేతంగా సినిమాకు వచ్చే ప్రేక్షకులు తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి ఉండకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకుల సంఖ్య పెరిగి, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా మెరుగుపడుతుందన్నారు. ఈ అంశంపై పన్నుల శాఖతో కూడా పరిశీలన చేయించాలని తెలిపారు. 
 
ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ సూచనల నేపథ్యంలోనే అధికారులు తక్షణమే రంగంలోకి దిగి థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో థియేటర్లలో కనీస సౌకర్యాల మెరుగు కోసం యజమానులు చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్