దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో, వకీల్ సాబ్ ఇలా అన్నీ మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతోంది. ఇది కూడా చాలా మంచి చిత్రం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు హోం బ్యానర్ లాంటిది అని నటి అంజలి అన్నారు.
దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ భార్యగా అంజలి నటించింది. పాత్ర గురించి అంజలి చెబుతూ, గేమ్ చేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ గారు కథ చెప్పినప్పుడు.. కారెక్టర్ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ కారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్ గారు నా పర్ఫామెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్లో ది బెస్ట్ చిత్రం, కారెక్టర్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.
- పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. నా పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ ఉంటుందని శంకర్ గారు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇంకా నేను ఆ కారెక్టర్ గురించి ఎక్కువగా చెప్పకూడదు. అది థియేటర్లో ఆడియెన్స్ చూసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సెట్స్ నుంచి వచ్చినా కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్లో ఇదే బెస్ట్ కారెక్టర్.
- నేను కథ విన్నప్పుడు నేషనల్ అవార్డు స్థాయిగల పాత్ర అనిపించింది. ఇప్పుడు అంతా అంటున్నారు. అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలి.
- పాత్ర గురించి ఎదురైన సవాళ్లు చెప్పాలంటే...
బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ యాక్టర్ అయినా కూడా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కారెక్టర్, ఆ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తది. నాకు ఇలాంటి ఘటనలు, మనుషులు ఎప్పుడూ ఎదురు కాలేదు. చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ పాత్రను పోషించేందుకు, నటనతో ఆడియెన్స్‌ను నమ్మించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
- గేమ్ చేంజర్ వల్ల నా ఆలోచనాధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను. ఇక నెక్ట్స్ ఎంచుకునే పాత్రలు, సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ విషయంలో నాకు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.