Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Pawan kalyan

ఠాగూర్

, సోమవారం, 6 జనవరి 2025 (14:53 IST)
రాజమండ్రిలో జరిగిన 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు. జనసేన తరపున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ, ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
ప్రమాదం జరిగిన కాకినాడ - రాజమండ్రి రోడ్డును గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. పాడైపోయిన రోడ్డును కొంతకాలంగా బాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ ప్రమాదవశాత్తు మృతిచెందడం బాధించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు జనసేనాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 
ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఈవెంట్‌‍లో ఒకటికి రెండుసార్లు తాను చెప్పినట్లు పవన్ గుర్తు చేశారు. ఈ ప్రమాదం తనను ఎంతో బాధించిందన్నారు. జనసేన తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం... ప్రభుత్వం తరపున కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. 
 
మరోవైపు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  కూడా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. వేడుక ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చనిపోయారు. అభిమానుల మృతి విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులతో పాటు తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
 
ఈ ప్రమాదంపై రామ్ చరణ్ మాట్లాడుతూ... "ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయి పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధపడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియస్తున్నాను' అని అన్నారు. 
 
ఇక ఇప్పటికే మృతుల కుటుంబాలకు నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా... పవన్ కూడా రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను జనసేనాని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)