Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాట తప్పితే రాళ్లతో కొట్టమన్నావ్.. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు కేసీఆర్?: వైయస్ షర్మిల

Advertiesment
మాట తప్పితే రాళ్లతో కొట్టమన్నావ్.. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు కేసీఆర్?: వైయస్ షర్మిల
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (20:07 IST)
ప్రజాప్రస్థానంలో భాగంగా వైయస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం ఆగర్మియగూడ గ్రామ శివారులో ఈ రోజు ఉదయం పాదయాత్ర మొదలుపెట్టారు. దాదాపు 4 కిలోమీటర్లు నడిచి తిమ్మాపూర్ గ్రామానికి చేరుకున్నారు.

ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నందున ఈ రోజు కూడా దీక్ష చేశారు. 14వ వారం తిమ్మాపూర్ గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజలు అడుగడుగునా వైయస్ షర్మిలకి మద్దతు తెలిపారు. మహిళలు పలు సమస్యలను వైయస్ షర్మిల గారికి నివేదించారు. సాయంత్రం 5గంటలకు దీక్ష విరమించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. ‘‘1200 మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదు కానీ అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఉద్యోగాలు ఇవ్వాలని ఎంత మొరపెట్టుకున్నా కేసీఆర్ స్పందించడం లేదు. ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు.

ఉద్యమంలో చందమామలాంటి చక్కటి పిల్లలు ఉద్యోగాలు లేక చనిపోతున్నారని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అదే నిరుద్యోగులు కండ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటున్నా కనికరం చూపించడం లేదు. దున్నపోతు మీద వానపడ్డట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.

ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగమన్నాడు. లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఇందులో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదు. కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్లో ఓడిపోతే..  వెంటనే ఎమ్మెల్సీని చేసి పదవి కట్టబెట్టాడు. కానీ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు ఆత్మహత్యలే మిగిలుతున్నాయి.
 
వైయ‌స్ఆర్ పాల‌న‌లో నిరుద్యోగులు, విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. ఏ ఒక్కరూ ఆత్మహ‌త్య చేసుకోలేదు. ఐదేండ్లలోనే మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చి, ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. 2008లో జంబో డీఎస్సీతో 54వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన మ‌హ‌నీయుడు వైయ‌స్ఆర్. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11ల‌క్షల ఉద్యోగాలు సృష్టించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేష‌న్ల ద్వారా పేద‌ల‌కు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి క‌ల్పించారు. పేద‌వాడికి జ‌బ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల‌పాల‌వుతుంద‌ని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఫోన్ చేసిన 20 నిమిషాల‌కే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చేలా చేసిన గొప్ప నాయ‌కుడు మ‌న వైయ‌స్ఆర్.

ఐదేండ్లలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 45ల‌క్షల ఇండ్లు నిర్మిస్తే.. వైయ‌స్ఆర్ గారు ఐదేండ్ల‌లోనే తెలుగువారికి 46ల‌క్షల ప‌క్కా ఇండ్లు క‌ట్టించి ఇచ్చారు. ఐదేండ్లలో ఒక్క చార్జీ  కూడా పెంచ‌కుండా సంక్షేమ పాల‌న అందించిన రికార్డు ముఖ్యమంత్రి మ‌న వైయ‌స్ఆర్ గారిది. ఇచ్చిన మాట ప్రకారం 64ల‌క్షల రైతుల‌కు రుణ‌మాఫీ చేశారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని మొట్టమొద‌ట ఆలోచ‌న చేసిన నాయ‌కుడు మ‌న‌ వైయ‌స్ఆర్.

మ‌హిళ‌ల‌కు పావ‌లా వ‌డ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డేలా చేశారు. మ‌హిళ‌ల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాల‌నే ఉద్దేశంతో ఎన్నో విద్యాసంస్థలు, యూనివ‌ర్సిటీలు నెల‌కొల్పారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారు.వైయ‌స్ఆర్ హ‌యాంలో ఎంతో మంది పేద‌లు.. డాక్టర్లు, ఇంజ‌నీర్లు అయ్యారు. వైయ‌స్ఆర్ గారు ఏం చేసినా అద్భుతంగానే ఉండేది.
 
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. రైతులకు రుణమాఫీ అని, కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని దగా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. 4లక్షల అప్పులు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి, లిక్కర్ ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఏడేండ్లలో 3000  బడులను మూసివేశారు.

14000 టీచర్లను తొలగించారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోగా.. ప్రైవేటులోనూ ఉద్యోగాలు కల్పించడం లేదు. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూరగాయలు, టిఫిన్ సెంటర్లు, టీ బండిలు, హమాలీ పనికి పోతున్నారు.

మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపండి అని కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన మాట.. అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ ను ఏం చేయాలో ప్రజలే తేల్చాలి. మళ్లీ మళ్లీ కేసీఆర్ చేతిలో ప్రజలు మోసపోవద్దు. ఇప్పటికే కేసీఆర్ చేతిలో రెండు సార్లు మోసపోయారు.
 
నిరుద్యోగుల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచన చేయలేదు. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. ఏడేండ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగింది. ప్రభుత్వం దగ్గరే 54లక్షల మంది మేం నిరుద్యోగులం మాకు ఉద్యోగాలు కల్పించండి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకోని వాళ్లు ఎంత మందో లెక్కలేదు.

నిరుద్యోగం తెలంగాణను పట్టి పీడిస్తున్నా కేసీఆర్ లో చలనం లేదు. ఇదీ కేసీఆర్ ని ఎన్నుకున్నందుకు మనకు ఇచ్చిన బహుమతి. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజంలో తలెత్తుకుని తిరగలేక, తల్లిదండ్రులకు భారం కాలేక... చనిపోతుంటే కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగుల ఆవేదన కేసీఆర్ కు పట్టదు. ఫామ్హౌజ్లో నిద్రపోడానికా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసింది? మన పిల్లల్ని చంపడానికా కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంది?
 
విద్యార్థులు, నిరుద్యోగులు ఎవ‌రూ ఆత్మహ‌త్య చేసుకోవ‌ద్దు. మేం మీ ప‌క్షాన  నిల‌బ‌డ‌తాం.. మీ ప‌క్షాన‌ పోరాటం చేస్తాం. మీకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు, మీకు ఉద్యోగాలు వ‌చ్చే వ‌ర‌కు మీ ప‌క్షాన ఉంటాం. అధికారంలోకి వ‌చ్చాక మీ మేలు కోసం ప‌నిచేస్తాం. కేసీఆర్ ను పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇకనైనా ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి.

కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3లక్షల 85వేల ఖాళీలను సైతం భర్తీ చేయాలి. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలి. 54లక్షల మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలి. 10లక్షల మంది అర్హులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలి. ఇవ‌న్నీచేత‌కాక పోతే ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి, ద‌ళితున్ని ముఖ్యమంత్రి చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి బొత్స సత్యనారాయణ