Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యమా?: హైకోర్టు

సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యమా?: హైకోర్టు
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:58 IST)
సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళా కార్యదర్శులు సివిల్‌ వివాదాలు పరిష్కరించవచ్చునని ఏపీ ప్రభుత్వం పేర్కొనడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో ‘మహిళా పోలీసు’లుగా పరిగణిస్తూ ప్రభుత్వం జీవో 59ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

రెవెన్యూ శాఖలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసు చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆ జీవో ఉందని విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘‘పోలీసు శాఖలో జరిగే నియామకాలన్నీ పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. పోలీసు విధులు నిర్వర్తించే హోం గార్డులను సైతం పోలీసులుగా పరిగణించడం లేదు. అలాంటిది సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించి కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు కట్టబెట్టడం చట్ట విరుద్ధం.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జోక్యం చేసుకోవాలి. 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీసు యాక్ట్ కు ఇది విరుద్ధం. సివిల్ వివాదాల్లో పోలీసులు ఎక్కడా జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అది విరుద్ధం’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.

పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా ఇస్తారో చెప్పాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యాటక హోటళ్లలో శతశాతం ఆక్యుపెన్సీపై దృష్టిపెట్టాలి: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు