Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి బొత్స సత్యనారాయణ

Advertiesment
రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి బొత్స సత్యనారాయణ
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (20:04 IST)
రాష్ట్రంలో నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ క్రెడాయ్ ప్రతినిధులతో  ఆయన సమావేశమయ్యారు.

రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై  చర్చించి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు.  విశాఖ పట్టణం ఎంపి ఎం.వి.వి. సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి రామమనోహర్,  కమిషనర్ (సిడిఎంఎ) ఎం.ఎం.నాయక్, డిటిసిపి రాముడు తోపాటు క్రెడాయ్ ప్రతినిధులు రాజా శ్రీనివాస్, కెఎస్ సి బోస్, ఆర్ వి స్వామి , జివిఎస్ సి రాయుడు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న జీవోలు, అందుకు అనుగుణంగా రూపొందించిన మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు తీసుకుని రావాలని, కోవిడ్ కారణంగా పనులు మందగించినందున, నిర్మాణాలు పూర్తి కాలేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో జారీ చేసిన అనుమతులు (బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్) గడువును పొడిగించాలని క్రెడాయ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

టిడిఆర్ ల జారీ వాటి కాలపరిమితి, వేకెంట్ ల్యాండ్ టాక్సు, ఎల్ ఆర్ ఎస్ అమలు, ఆన్ లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను వారు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగే ఆక్సుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని కూడా వారు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని , ఆ కోవలోనే రియల్ ఎస్టేట్ రంగంలోని అనేక సమస్యలను పరిష్కరించి, నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గతంలో ఎన్నడూ లేనట్లుగా క్రెడాయ్, ఇతర సంఘాల ప్రతినిధులతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హాల్డర్లందరితో సమగ్రంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు రూపొందిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు.

అయితే ఆ ఉత్తర్వుల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ, ఇటీవల క్రెడాయ్ ప్రతినిధులు తన దృష్టికి తీసుకుని వచ్చిన దరిమిలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.  సమావేశంలో చర్చించిన అంశాలన్నిటిని అధ్యయనం చేసిన తరువాత త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తగిన ఉత్తర్వులను జారీ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌వంబ‌రు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం