చిన్న దానికే ప్రాణాలు పోయిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఈ సమాజంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. కోడి గుడ్డు తిని ఓ మహిళ కన్నుమూసింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. తిమ్మాజి పేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నేరళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ (50) అనే మహిళ బుధవారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేశారు. నిన్న భోజనంతో పాటు ఉడకబెట్టిన కోడి గుడ్డు (Boiled Egg) కూడా తీసుకున్నారు. గుడ్డును ముక్కలుగా కోయకుండా.. మొత్తం నోట్లోకి వేసుకున్నారు. అనంతరం నమిలేందుకు ప్రయత్నించగా.. అది ఒక్కసారిగా గొంతులోకి జారిపోయింది. గుడ్డు గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక నీలమ్మ విలవిల్లాడిపోయారు.
శ్వాస ఆగిపోయి అక్కడిక్కడే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గుడ్డుని గొంతులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శ్వాస అందక నీలమ్మ కన్నుమూశారు.
ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా తమ ముందే ఉన్న మనిషి.. క్షణాల్లోనే మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీలమ్మ మృతిని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.