Publish Date: Sun, 01 Aug 2021 (16:17 IST)
Updated Date: Sun, 01 Aug 2021 (16:18 IST)
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైతే బంగారు బోనం సమర్పిస్తానని ఏడేళ్ళ క్రితం మొక్కుకున్నాననీ, దాన్ని ఇపుడు తీర్చినట్టు ఆ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ మహిళా నేత విజయశాంతి చెప్పారు.
ఆదివారం లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాదు పాతబస్తీలో కొత్త శోభ కనిపిస్తోంది. రాజకీయ ప్రముఖులు కూడా బోనాలు సమర్పించేందుకు తరలిరావడంతో కోలాహలం మిన్నంటుతోంది.
బీజేపీ మహిళా నేత విజయశాంతి కూడా లాల్ దర్వాజా సింహవాహినీ జగన్మాతకు బోనాలు సమర్పించారు. తెలంగాణ వస్తే బంగారు బోనం సమర్పిస్తానని ఏడేళ్ల కిందట మొక్కుకున్నానని చెప్పిన విజయశాంతి, ఆ మేరకు బంగారు కలశంతో బోనం తెచ్చానని వెల్లడించారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, అధికారంలోకి తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థించానని, బీజేపీ గెలిస్తే మరోసారి బంగారు బోనమెత్తుతానని అమ్మవారికి మొక్కుకున్నానని విజయశాంతి వెల్లడించారు. నియంతృత్వంలో అల్లాడిపోతున్న తెలంగాణలో ప్రజాపాలన బీజేపీతోనే సాధ్యమని ఆమె ఉద్ఘాటించారు.
కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి శక్తిపై తనకు నమ్మకం ఉందని అన్నారు. కాగా, విజయశాంతి వెంట బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.