ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడమర గాలులు బలంగా వీస్తాయని, అలాగే వచ్చే మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
అయితే, రాష్ట్రంలో వీస్తున్న పడమర గాలుల కారణంగా ఏపీలో రాగల మూడు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ మేరకు రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై నివేదికను అధికారులు విడుదల చేశారు.
వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో వర్షాలు కురుస్తాయన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్రాలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పలు చోట్లు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.