తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో ఆయన మూడు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నట్టు తెలుస్తుంది.
తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని, ఇపుడు బంగారు భారత్ చేయాలన్న పట్టుదలతో జాతీయ రాజకీయాల్లోకి రానున్నట్టు సీఎం కేసీఆర్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలుసుకుంటూ వస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో సమావేశమయ్యారు. ఇపుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైగా, సీఎం కేసీఆర్ వెంట సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం. అలాగే, తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను సీఎం కేసీఆర్ నియమించుకున్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది.