మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతూనే వున్నాయి. బలాత్కారాలు, గృహ హింసలు ఓ వైపైతే.. మాయమాటలతో లొంగదీసుకుని ప్రేమ పేరుతో మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా మహబూబాబాద్‌లో ఓ యువకుడు గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలతో మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు. అయితే అత్యాచారం సమయంలో ఆమె గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అత్యాచారం సమయంలో ఊహించని షాక్‌కు గురైన ఆమె గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో చోటుచేసుకుంది. వివరాలాల్లోకి వెళితే.. తండాకు చెందిన మోడు లక్‌పతి, వసంత దంపతుల కుమార్తె ఉష (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
తండ్రి లక్‌పతికి మహబూబాబాద్ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద కిరాణ దుకాణం ఉంది. ఇటీవల ఆయన కాలు విరగడంతో షాపులో ఉన్న సరుకులు తీసుకురావాలని శనివారం కూతురు ఉషను పంపించాడు. అదే సమయంలో ధర్మారం గ్రామానికి చెందిన ధరంసోత్ రాజేశ్ దుకాణం వద్దకు వచ్చాడు.
ఉషకు మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన స్నేహితుడు, సీతారాం తండాకు చెందిన శ్రీనుకు ఫోన్ చేసి నీళ్లు తీసుకురావాలని సూచించాడు. అతను తన స్నేహితుడైన శంకర్‌తో కలసి వచ్చే సరికి ఉష స్పృహ తప్పి ఉంది. దీంతో ముగ్గురు కలసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఉష అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై అమాయకురాలైన తమ బిడ్డకు మాయమాటలు చెప్పి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఉష తల్లిదండ్రులు లక్‌పతి, వసంత బోరున విలపించారు. ఈ ఘటనలో రాజేశ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. కాగా, ఉషపై రాజేశ్ ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా..?, మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.