దేశంలో సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పైగా, కేంద్రానికి వరుస ప్రశ్నలు సంధించింది. టీకాల కొరత, సమీకరణ, ధరలు, విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా, 45 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం డోసులు ఇచ్చి.. 18 - 44 ఏళ్ల వారికి మాత్రం 50 శాతమే ఎందుకు ఇస్తున్నారని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్.ఎన్. రావు, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది.
'45 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రమే టీకాలను సమీకరిస్తోంది. కానీ, 18 నుంచి 44 ఏళ్ల వారికి మాత్రం సగం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. వాటి ధరలనూ కేంద్రమే నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పోను మిగతా డోసులను ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వవచ్చని ఆదేశాలూ ఇచ్చింది. ఏ ప్రాతిపదికన ఈ విధానాలను రూపొందించారు?' అని ప్రశ్నించింది.
మరోవైపు, దేశంలో 45 ఏళ్లు దాటిన వారిలోనే కరోనా మరణాల ముప్పు ఎక్కువుందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ, ఇప్పుడు కరోనా రెండో దశ వ్యాప్తిలో 45 ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది చనిపోతున్నారని కోర్టు గుర్తుచేసింది. అలాంటప్పుడు కేవలం 45 ఏళ్ల పైన వారి కోసమే కేంద్రం టీకాలను ఎందుకు సమీకరిస్తోంది? అని ప్రశ్నించింది.
అలాగే, కరోనాటీకాల కోసం కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధననూ తప్పుబట్టింది. ఈ నిబంధన వల్ల ఇంటర్నెట్ అంతంతమాత్రంగానే ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సరిగ్గా సాగదని అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కొవిన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సవాలుతో కూడుకున్నదేనని అభిప్రాయపడింది.