కరోనా కష్టకాలంలో విద్యా సంవత్సరానికి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. గత యేడాది కాలంగా పాఠశాలలు తెరుచుకోలేదు. కేవలం ఆన్‌లైన్ తరగతులే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ యేడాది జరగాల్సిన 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. ఈ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర విద్యా శాఖ కసరత్తులు చేస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్రం వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షల నిర్వహణపై ఓ సూచన అందరి దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
ఈ సూచన మేరకు ఏ స్కూళ్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ కేంద్రాల్లోనే పరీక్షలను నిర్వహించి.. కేవలం 90 నిమిషాల్లో మల్టిపుల్ ఛాయిస్, షార్ట్ క్వశ్చన్స్ విధానంలో పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. దీనికి చాలా రాష్ట్రాలు ఓకే చెప్పారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పరీక్షలు నిర్వహిస్తే.. జులై 15, ఆగస్టు 26 మధ్య చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను జూన్ ఒకటవ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. పూర్తిగా కరోనా నిబంధనలను పాటిస్తూ.. రెండు దశల్లో పరీక్షలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. దేశంలో పెరుగుతోన్న కరోనా నేథ్యంలో పరీక్షలను రద్దు చేయాలంటూ ఇప్పటికే తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రధానికి లేఖలు రాసిన విషయ తెలిసిందే.