వైకాపాకు చెందిన నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామరాజుకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది.
సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.
ఈ సందర్భంగా కోర్టు రఘురామరాజుకు కొన్ని ఆంక్షలు విధించింది. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలనీ, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలనీ, ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదనీ, దర్యాప్తును ప్రభావితం చేయకూడదదనీ, మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదనీ, గతంలో చూపించినట్లు తన గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదనీ, నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామంటూ హెచ్చరించింది.
రాగా, ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు రాఘురామను అరెస్ట్ చేశారు. రాజద్రోహానికి పాల్పడ్డారంటూ ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసింది. ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు.
అయితే... ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామ అంగీకరించలేదని, ఆయన భార్య రమాదేవి కూడా నోటీసు తీసుకునేందుకు నిరాకరించడంతో ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది.