తమ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామరాజు పచ్చి అబద్దాలకోరని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలేనంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించింది.
రాజద్రోహం కేసులో ఏపీ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారనీ, జైలులో చిత్ర హింసలు పెట్టి, కొట్టారని పేర్కొంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ వేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్‌లో ఆరోపించింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపింది వాక్ స్వాతంత్ర్యం పేరుతో హద్దు మీరకూడదని, కానీ రఘురామకృష్ణరాజు అతిక్రమించారని వివరించింది.
ప్రజల మధ్యన చీలికలు తెచ్చే ప్రయత్నాలు సరికాదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటనలు, వ్యాఖ్యలు బాగా పరిశీలించాకే కేసు నమోదు చేశామని వివరించింది. రఘురామ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది.