తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త విద్యుత్ టారిఫ్‌లను విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు ప్రతిపాదించి ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన మరుక్షణమే విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.
తాజాగా చేసిన ప్రతిపాదనల మేరకు... గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య వినియోగదారులపై ఒక్క రూపాయి చొప్పున పెంచేలా ప్రతిపాదించారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించింది.
తెలంగాణాలోని విద్యుత్ డిస్కంలు దాదాపు 10 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. ఈ నష్టంలో కొంతైనా భర్తీ చేసుకునేందుకు వీలుగా ఇపుడు విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు కోరుతున్నాయి. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమైందని విద్యుత్ అధికారులు సెలవిస్తున్నారు.