నిన్నామొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇపుడు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి విమర్శల దాడి చేస్తున్నారు. ఇందులోభాగంగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే స్యభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు వ్యాప్తంగా వాల్‌పోస్టర్లు వెలిశాయి.
మునుగోడు నిన్ను క్షమించదు.. రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏండ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి అని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ పోస్టర్లు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెలిశాయి.
మునుగోడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇక మిగిలింది ఉప ఎన్నికే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు మునుగోడుపై దృష్టి కేంద్రీకరించాయి. కోమటిరెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారు.