ఒకటి రెండు కాదు.. ఏకంగా 206 రాళ్లను హైదరాబాద్ వ్యక్తి కడుపు నుంచి తొలగించారు. ఆరునెలల పాటు 206 రాళ్లను పొట్టనబెట్టుకుని అష్టకష్టాలు పడిన ఆ వ్యక్తి ప్రస్తుతం శస్త్ర చికిత్స ద్వారా ఊపిరిపీల్చుకున్నాడు. అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్సతో ఆ రాళ్లు తొలగించారు.
వివరాల్లోకి వెళితే, నల్గొండకు చెందిన ఈ వీరమల్ల రామలక్ష్మయ్యకు కీ హోల్ సర్జరీతో వాటిని తొలగించారు వైద్యులు. సదరు రామలక్ష్మయ్య స్థానిక హెల్త్ ప్రాక్టీషనర్ వద్ద చికిత్సతో తాత్కాలిక ఉపశమనం పొందేవాడు. కానీ రోజువారీగా నొప్పి వస్తుండటంతో విధులు కూడా నిర్వర్తించలేకపోయేవాడు.
అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు (యూరాలజిస్ట్) డాక్టర్ పూల నవీన్ కుమార్ సదరు రామలక్ష్మయ్యకు వైద్య పరీక్షలు చేశారు. ప్రారంభంలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కిడ్నీలో ఎడమ వైపు చాలా రాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు.
సీటీ క్యూబ్ స్కాన్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకున్నారు. దీంతో రామలక్ష్మయ్యకు వైద్యులు కౌన్సెలింగ్ చేసి.. కీ హోల్ సర్జరీకి సన్నద్ధం చేశారు. గంట సేపు సర్జరీ చేసి ఆ రాళ్లన్నీ తొలగించామని చెప్పారు. సర్జరీ చేశాక కోలుకున్న రామలక్ష్మయ్యను రెండో రోజే డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.