ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జిల్లాకో ఎయిర్‌పోర్టు నిర్మిస్తానని చెప్పిన సీఎం జగన్ ఇపుడు మండలానికో జూనియర్ కాలేజీని స్థాపిస్తామని తెలిపారు. అదీ కూడా కేవలం బాలికలకు మాత్రమే. అందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర విద్యాశాఖపై జరిపిన సమీక్షలో భాగంగా, సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 23975 పాఠశాలల్లో నాడు నేడు రెండో విడత కింద పనులు జరిగాయని చెప్పారు. నెల రోజుల్లో నూటికి నూరు శాతం రెండో దశ కింద పనులు చేపట్టనున్నట్టు తెలిపారు.
ముఖ్యంగా గోరుముద్దు, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ వంటివాటి అమలుపై మరింత ధ్యాస పెట్టాలని కోరారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇపుడు ఏకంగా 1200 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా కేజీబీవీ లేదా హైస్కూల్ ప్లస్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు.