ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లీష్‌లో అదరగొడుతున్న విద్యార్థుల ప్రతిభ చూసి జగన్ మురిసిపోయారు.
ఒక్కో విద్యార్థిని ప్రత్యేకంగా పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్న జగన్.. వారి గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు ఎదురుగా ఉన్నా విద్యార్థులు మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు, స్కూళ్ల అభివృద్ధి వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడవచ్చని.. మీరు అమలు చేస్తున్న పథకాలు చక్కగా ఉన్నాయని రేష్మ అనే విద్యార్థిని సీఎంతో చెప్పింది. విద్యార్థులకు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కితాబు ఇచ్చింది.