ఎన్నికల కోడ్ అమలైతే రాజకీయ నాయకులపై తీసే బయోపిక్‌ల విడుదలపై ఇప్పటివరకు అనేక అనుమానాలున్నాయి. కోడ్ సమయంలో బయోపిక్‌లను విడుదల చేయకూడదంటూ కొందరు వాదిస్తుండటంతో మరికొందరు ఆ వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ సందేహాలకు తెరదించారు.
ఈరోజు మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజకీయ నాయకుల బయోపిక్ సినిమాల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అటువంటి ఫిర్యాదులు చేస్తే తప్పకుండా వాటిని పరిశీలిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో రజత్ కుమార్ పలు అంశాలపై మాట్లాడారు.
ఈవీఎంలపై ప్రజలకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని, వాటిని పూర్తిగా పరిశీలించి ఒకట్రెండు సార్లు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాతే వాటిని పోలింగ్ బూత్‌లలో ఉంచుతామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలను ఈసీ సరైన సమయానికే ప్రకటించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులపై, వారి సోషల్ మీడియా మరియు ఆర్థిక లావాదేవీలపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.