ఎక్కడైనా సరే కంటికి శవాలు కనిపిస్తే చాలు... తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. ఆపై వారు చేసే హంగామా, హడావుడి అంతాఇంతలా లేదు. మృతుని కుటుంబానికి పరామర్శలతో పాటు.. తగిన ఆర్థిక సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, తమ నియోజకవర్గం పరిధిలో ఎవరైనా చనిపోతే చాలు అక్కడ నేతలు గద్దల్లా వాలిపోతూ.. మృతుని కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుండగా... పరామర్శల పర్వం ఊపందుకుంది. వివిధ కారణాలతో మృతిచెందిన వారి ఇళ్ల ముందుకు రాజకీయ బంధువులు బారులు తీరుతున్నారు. అంత్యక్రియల్లో సైతం పాల్గొని ఆత్మీయులమని నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదారచడమే కాదు.. అవసరమనుకుంటే నాలుగు చుక్కల కన్నీళ్లూ రాల్చుతున్నారు. ఇలా... ఎన్నికల వేళ చావు ఇళ్లల్లో రాజకీయ సందడి నెలకొంది.
జనగామ జిల్లా పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌ఫూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ నేతల పరామర్శలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ పరామర్శల పర్వానికి పాలకుర్తి కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ఏడాదిన్నర క్రితమే శ్రీకారం చుట్టారు.
రాజకీయ సందడితో ఊపందుకున్న పరామర్శలు కొంత ఇబ్బందికరంగా మారాయని కొన్ని బాధిత కుటుంబాలు అంటున్నాయి. ఒకవైపు తాము తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నచోట ఓదార్పు పేరుతో ఎన్నికల ప్రచారం చేయడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.