Publish Date: Mon, 10 Apr 2023 (10:36 IST)
Updated Date: Mon, 10 Apr 2023 (10:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో సూర్య భగవానుడు తన ప్రతాపం చూపించనున్నారు. వచ్చే నాలుగు రోజుల పాటు ఈ సూర్యతాపం మరింత ఎక్కువగా ఉండనుంది. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా, సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది.
ఈ నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో పెరుగుదల ఉంటుందని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది.
సోమవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 11న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. ఇదిలావుంటే, రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఆదివారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా నల్గొండ జిల్లా పెద్దఅడిశెర్లపల్లి (పీఏ పల్లి) మండలం ఘన్‌పూర్‌లో 41.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటలో 41.8, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 41.7 డిగ్రీలు నమోదైంది.