నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి నెలకొనివుంది. ఇది బుధవారానికి తీవ్రమై అల్పపీడనంగా మారిందని వాతావణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది.
ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా మూడు రోజుల్లో తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని ప్రభావం నామమాత్రంగా ఉండనుందని తెలిపింది. ఈ నెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఏపీ వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో రాష్ట్రమంతటా దట్టమైన పొగమంచు, చలి ప్రభావం పెరుగుతుందని తెలిపింది.