ఆన్‌లైన్ లోన్ యాప్‌ల్లో లోన్ తీసుకున్న ఓ టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. ఆన్‌లైన్ లోన్లతో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆన్‌లైన్ అప్పులు, వేధింపులతో చనిపోయే వారు పెరుగుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కిస్మాత్‌పూర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీల్.. ఇన్‌స్టంట్ లోన్‌లో రూ.70 వేలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు లోన్ యాప్ ప్రతినిధులు. దీంతో.. ఒక బాకీ తీర్చేందుకు మరో యాప్‌లో లోన్ తీసుకున్నాడు సునీల్.. ఇలా అప్పులు చేస్తూ చేస్తూ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయాడు.
ఇక, రూ.70 వేల అప్పు కట్టకపోవడంతో సునీల్ తల్లికి ఫోన్ చేసి మరి బెదిరించింది లోన్ యాప్ టీమ్. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన సునీల్.. కిస్మాత్‌పూర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ లోన్ యాప్ ప్రతినిధుల వేధింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి భార్య.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.