Publish Date: Wed, 14 Apr 2021 (08:37 IST)
Updated Date: Wed, 14 Apr 2021 (08:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో బిఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు ఒత్తిడి కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. ఈ విషాదకర ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఫిబ్రవరిలో కిడ్నాప్ నాటకమాడి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లి డిమాండ్ చేసింది.
ఇదే అంశంపై మృతురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ, కీసర ఠాణా పరిధిలోని రాంపల్లి ఆర్‌ఎల్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు మా కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు. అప్పటికే ఆయనకు వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారని చెప్పారు. మాయమాటలతో కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు.
సదరు యువకుడు, ఆయన స్నేహితురాలు మా కూతురును మానసిక, శారీరకంగా ఇబ్బందులు పెట్టారన్నారు. అవమానం భరించలేక బీపీ, షుగర్ మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడిందన్నారు. సదరు యువకుడి ఒత్తిడి వల్ల ఆటో డ్రైవర్ల పేర్లు చెప్పారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. విద్యార్థిని సదరు యువకుడితో కలిసి దిగిన చిత్రాలను ఆమె మీడియాకు అందజేశారు.
బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కారకుడిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదని ఘట్‌కేసర్ సీఐ ఎన్.చంద్రబాబు చెప్పారు. ఆ సమయంలో అన్ని కోణాల్లో అడిగిన ఎలాంటి సమాధానం రాలేదన్నారు. కేసు మూసివేయలేదని, ఇప్పటికైనా ఫిర్యాదు చేస్తే ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని సీఐ పేర్కొన్నారు.