Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో 9న విచారణ... మృతదేహాల అంత్యక్రియలకు బ్రేక్‌

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో 9న విచారణ... మృతదేహాల అంత్యక్రియలకు బ్రేక్‌
, శనివారం, 7 డిశెంబరు 2019 (08:45 IST)
షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. సాయంత్రం 6గంటలకు అందిన వినతిపత్రంపై స్పందించిన హైకోర్టు విచారణ చేపట్టింది.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరిఫ్, నవీన్‌, శివ, చెన్నకేశవుల మృతదేహాలను ఈనెల 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. శవపరీక్ష ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసినట్లు కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌పై ఈనెల 9న విచారణ చేపడతామని వెల్లడించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు మృతదేహాలకు అంత్యక్రియలు చేయరాదని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ మృతుల పోస్టు మార్టం నివేదికను పెన్‌డ్రైవ్‌ లేదా సీడీ రూపంలో శుక్రవారం సాయంత్రమే మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రధాన కోర్టు న్యాయమూర్తికి అందించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎ్‌స.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం హౌజ్‌ మోషన్‌లో ఆదేశాలు జారీ చేసింది.
 
దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణ కోరుతూ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ధర్మాసనం హౌజ్‌మోషన్‌లో విచారణ చేపట్టింది. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ వాదిస్తూ, ఎన్‌కౌంటర్‌ మృతులకు మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారని తెలిపారు.

ఈ ప్రక్రియను పూర్తిగా వీడియో తీసినట్లు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టును సీడీ లేదా పెన్‌ డ్రైవ్‌లో భద్రపరిచి జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందించాలని ఆదేశించింది. మళ్లీ డిసెంబర్‌ 9 ఉదయం 10.30గంటలకు కేసు విచారించాలని ధర్మాసం నిర్ణయించింది.
 
మళ్లీ పోస్టుమార్టం చేయించండి
చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించే వైద్యబృందంతో మృతులకు మళ్లీ పోస్టుమార్టం చేయించాలని పలువురు మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు హైకోర్టు ప్ర ధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కోరా రు. మహిళపై హత్యాచార సంఘటనపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం కావడం, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, లేని పక్షంలో తమకు అప్పగించాలంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నలుగురు ఎన్‌కౌంటర్‌లో హతం కావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని సామాజిక కార్యకర్త కె.సజయ, నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూమెంట్‌(ఎన్‌ఎపీఎం)కు చెందిన మీరా సంఘ మిత్ర, ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పద్మజాషా, పలువురు ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు.
 
హక్కుల కమిషన్‌ ఆదేశం కూడా
దిశ హంతకుల అంత్యక్రియలకు బ్రేక్‌ పడింది. తాము వచ్చి పరిశీలించిన తర్వాతే మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించాలని, అంతవరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించడంతో ప్రభుత్వం మృతదేహాల అప్పగింతను నిలిపేసింది. మృతదేహాలకు మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. సాయంత్రం 4.45కు ఆస్పత్రికి శవాలు వచ్చాయి.

గాంధీ ఆస్పత్రి వైద్యులు స్థానిక ఫొరెన్సిక్‌ విభాగం వారితో సంబంధం లేకుండా పోస్ట్‌మార్టం మొదలు పెట్టడంతో వారిమధ్య జరిగిన వివాదంతో పోస్ట్‌మార్టం నిర్వహణ ఆలస్యమైంది. జిల్లా జడ్జి ప్రేమావతి సైతం తాను రాకుండానే పోస్ట్‌మార్టం ప్రక్రియ ఎలా మొదలు పెడతారని ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు మృతదేలకు రాత్రి 9 గంటల వరకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపరచి, మార్చురీలో ఉంచి తాళం వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కియాపై వైసీపీ అప్పుడలా.. ఇప్పుడిలా..