దిశ కేసులో నిందితులైన నలుగురు నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు సంఘటన స్థలమైన చటాన్‌పల్లికి శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు.
చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం తెల్లవారుజామున దిశ నిందితులైన ఏ1ఆరిఫ్, ఏ2జొల్లు శివ, ఏ3జొల్లు నవీన్, ఏ4చెన్నకేశవులును చటాన్‌పల్లికి పోలీసు వ్యానులో తీసుకువచ్చారు.
దర్యాప్తులో భాగంగానే అసలు సంఘటన జరిగిన స్థలంలోనే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు మేల్కొని కాల్పులు జరిపారు. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
చీకట్లో నిందితులు పారిపోయేందుకు యత్నించారని పోలీసులు చెప్పారు. నిందితుల్లో ముందు ప్రధాన నిందితుడైన ఆరిఫ్ పోలీసుల దాడి చేశాడు. దీంతో మిగతా ముగ్గురు కూడా పోలీసులపై తిరగబడ్డారని సమాచారం.
నిందితులు పోలీసుల చేతుల్లో ఉన్న తుపాకులను లాక్కోనేందుకు యత్నించగా, వీలుకాకపోవడంతో వారు పోలీసులపై రాళ్ల దాడి చేస్తూ పారిపోతున్నారని పోలీసులు చెప్పారు.
దీంతో పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తున్నారు.
సంఘటన స్థలం చేరువలోనే మరణించారు.దర్యాప్తులో భాగంగా కోర్టు ఆదేశంతో దిశ నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
దిశ నిందితుల దర్యాప్తు పర్వంలో పోలీసు ఉన్నతాధికారులు మొదటి నుంచి అత్యంత గోప్యంగా వ్యవహరించారు. గురువారం అర్దరాత్రి దిశ నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి గురువారం అర్దరాత్రి రెండు గంటలప్రాంతంలో రహస్యంగా పోలీసులు సంఘటన స్థలానికి తరలించారు. ముందుగా తొండుపల్లి టోల్ గేట్ వద్దకు తీసుకువెళ్లి లారీ నిలిపిన ప్రదేశం, మద్యం తాగిన ప్రాంతాలను చూశారు.
అనంతరం వారిని దిశను దహనం చేసిన చటాన్‌పల్లి వద్దకు తీసుకువచ్చి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో నిందితులు అక్కడికక్కడే మరణించారు.
గురువారం అర్దరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దర్యాప్తు తంతు మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. శుక్రవారం తెల్లవారాక ఏడు గంటలకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ గురించిన సమాచారం మీడియాకు అందింది.
దీంతో మీడియాతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలివచ్చారు. దిశ నిందితుల దర్యాప్తు నుంచి ఎన్‌కౌంటర్ దాకా పోలీసుల అత్యంత పకడ్బందీగా వ్యవహరించడంతోపాటు అత్యంత గోప్యత పాటించారు.