టీఆరెస్ లో అసమ్మతి సెగలు

బుధవారం, 11 సెప్టెంబరు 2019 (21:26 IST)
మంత్రివర్గ విస్తరణ తరువాత గులాబి నేతలు అసమ్మతి రాగం పెంచారు. దీంతో అసంతృప్తులను చల్లార్చేందుకు స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. రాబోయే రోజుల్లో గౌరవప్రదమైన పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు మనసులో బాధ బయటపెట్టిన నేతలు క్రమంగా యూ టర్న్‌ తీసుకుంటున్నారు.

గులాబి బాస్‌ మాటే ఫైనల్‌ అనుకుంటున్న టిఆర్‌ఎస్‌లో ఆ పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. ఇటీవల పరిణమాలు పార్టీలో అసమ్మతి సెగలు రేపాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో తమకు, తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదంటూ రెండు రోజులుగా పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ అసమ్మతి స్వరాన్ని వినిపించారు.

దీంతో నష్ట నివారణ చర్యలకు దిగారు అధినేత కేసీఆర్. అసమ్మతి రాగం వినిపించిన నేతలకు స్థానిక మంత్రులతో ఫోన్లు చేయించారు. రాబోయే రోజుల్లో గౌరవప్రదమైన పోస్టులు ఇచ్చి కాపాడుకుంటామని చెప్పి బుజ్జగించారు.

మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం లేదని మాట్లాడిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఇప్పుడు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. మాదిగలకు పెద్ద పీట వేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో కీలక పదవులు ఇస్తున్నారని.. తమకు అన్యాయం జరిగిందనీ చెప్పలేదు అంటూ సమర్థించుకున్నారు రాజయ్య.

మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లా నుంచి అవకాశం వస్తుందని ఎదురు చూసిన బాజీ రెడ్డి.. తనకు ఎలాంటి ఆశ లేదని ప్రకటించారు. మైనంపల్లి హనుమంత రావు ఇంటికి వెళ్ళిన మాట వాస్తవమేనన్న బాజీ రెడ్డి.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.

జిల్లా రాజకీయాల్లో తనకు ప్రత్యేక ఫాలోయింగ్‌ ఉందని.. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఉన్నత పదవులు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మరో మాజీ మంత్రి జోగు రామన్న సైతం అజ్ఞాతం వీడారు. కుటుంబ సభ్యులకు అందుబాటులోకి వచ్చారు. మరోసారి మంత్రి అవుతానని ఆశపడ లేదన్నారు.

కేసీఆర్ అంటే తమకు గౌరవమని ఎట్టి పరిస్థితుల్లో అధినేత మాటను దాటేది లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నడూ లేనంతగా టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి చెలరేగడం చర్చనీయాంశమైంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం త్వరలో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు