నందమూరి బాలకృష్ణను టీ.టీడీపీ కీలక నేతలు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో ఉన్న బాలకృష్ణను కలిసి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ పార్టీ పెట్టే సీన్‌ని చిత్రీకరిస్తుండగా ఈ నేతలు వెళ్లడంతో.. వారంతా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఇదిలాఉంటే.. ప్రచారానికి రమ్మని కోరిన టీటీడీపీ నేతల ప్రతిపాదన పట్ల బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎన్టీఆర్ గెటప్‌లో ప్రచారానికి వస్తే బాగుంటుందని బాలయ్య గెటప్ చూసిన కొందరు నేతలు చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ… ఆనాటి ఎన్టీఆర్ వైభవం ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించనుంది. తెలంగాణలో పార్టీకి అండగా ఉండాలని బాలకృష్ణను కోరాం. నందమూరి, నారా కుటుంబాల సేవలను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకుంటాం అని తెలియచేసారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ… ఎన్టీఆర్ బయోపిక్ చరిత్రలో నిలిచిపోతుంది. బాలకృష్ణ నటన చూస్తుంటే… ఎన్టీఆరే స్వయంగా నటిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్టీఆర్ అండదండలతో ఈ ఎన్నికల్లో విజయభేరి మోగిస్తాం. రాజకీయాలపై బాలకృష్ణతో చర్చించలేదు అన్నారు.