చదివింది ఎంబిఏ. ఉండేది హైదరాబాద్‌లో. కష్టపడి పనిచేస్తే ఏం ఉపయోగం ఉండదని భావించింది. ఎలాగైనా అక్రమ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంది. అనుకుందే తడవుగా ఒక మ్యాట్రిమొనీగా ఏర్పాటు చేసుకుంది. ఆ మ్యాట్రిమొనీ పేరుతో గత రెండు సంవత్సరాల నుంచి ప్రవాస భారతీయులను టార్గెట్ చేసింది.
అందమైన అమ్మాయిల ఫోటోలను అప్‌లోడ్ చేసి పెళ్ళికి సిద్థమని చెప్పింది. రకరకాల ఫోన్ నెంబర్లు పెట్టుకుంది. ఇలా ఫోటోలు చూసి ఫోన్ చేసే ప్రవాస భారతీయులతో మాటలు కలిపేది. వారితో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతూ వారికి బాగా దగ్గరయ్యేది. ఏవేవో సమస్యలు చెబుతూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా ప్రవాస భారతీయులను మోసం చేసింది. ఈ మధ్యనే ఈమెపై ఒక ప్రవాస భారతీయుడు ఫిర్యాదు చేశాడు.
తాజాగా పవన్ అనే ప్రవాస భారతీయుడు ఆమెపై రాచగొండ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల క్రితమే ఒక కేసులో అరెస్టయి బెయిల్ పైన వచ్చిన ఈ యువతిని మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు.