Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటికీ నవ వధువును వెంటాడే శోభనం రాత్రి బెడ్ షీట్లు...

నేటికీ నవ వధువును వెంటాడే శోభనం రాత్రి బెడ్ షీట్లు...
, మంగళవారం, 18 జూన్ 2019 (19:09 IST)
"నాకు తొలిరాత్రి ఒక నరకంలా గడిచింది. తెల్లటి బెడ్‌షీట్ ఇచ్చి మమ్మల్ని గదిలోకి పంపారు. మా గది పక్కనే రాత్రంతా ఒకావిడ కాపలా కాశారు. తెల్లారిన తర్వాత ఆమె వచ్చి ఆ బెడ్‌షీట్‌ను తీసుకెళ్లి వీధుల్లో అందరికీ చూపించారు. అలా చేయడం నాకెంతో అవమానకరంగా అనిపించింది" అని 27 ఏళ్ల ఎల్మీరా (పేరు మార్చాం) గుర్తుచేసుకున్నారు.
 
ఎవరైనా తొలిరాత్రి అనేది తమ జీవితంలో సంతోషకరమైన రోజులలో ఒకటి కావాలని కోరుకుంటారు. కానీ, కఠినమైన పితృస్వామ్య సంప్రదాయాలు కలిగిన దేశాలలో మహిళలకు అదొక పీడకలగా మారుతోంది. అజర్‌బైజాన్‌కు చెందిన ఎల్మీరా డిగ్రీ చదివి, ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చూపించిన యువకుడితో ఆమెకు వివాహమైంది. వివాహం తర్వాత 'కన్యత్వ పరీక్ష' పేరుతో తను ఎంత మానసిక క్షోభను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆమె గుర్తు చేసుకున్నారు.
 
"అతడు మా పొరుగింటి వ్యక్తి. ఆలోచనలు, అభిరుచులల్లో అతనికి, నాకు ఎలాంటి పోలికలూ లేవు. అతడు ఏమీ చదువుకోలేదు. మా అన్నయ్యలు నన్ను అతనికి పరిచయం చేశారు. అతడు చాలా మంచివాడు అని చెప్పారు. మా అమ్మ మాట కాదనలేక అతనితో పెళ్లికి నేను ఒకే చెప్పాను. నేను ఇక పుట్టింటికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మా అమ్మ సంతోషపడింది.
 
వివాహం జరిగింది. శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, నాకు వెంటనే పిల్లలు కనాలని లేదు. కొన్నాళ్లు ఆగిన తర్వాత ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటామని మా అమ్మకు పదేపదే చెప్పాను. ఆ విషయాన్ని ఆమె మా బంధువులకు చెప్పింది. వాళ్లు నా కన్యత్వాన్ని అనుమానిస్తూ.. శోభనం జరగాల్సిందేనంటూ నా మీద ఒత్తిడి పెంచారు. అయితే, వాళ్లు అనుమానిస్తున్నట్లుగా నేనేమీ అంతకుముందు సెక్సులో పాల్గొనలేదు.
 
నా భర్త కూడా నన్ను ఏమాత్రం అర్థం చేసుకోకుండా బలవంతపెట్టాడు. ఒక్కసారిగా నా మీద పడిపోయాడు. అతన్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించడం ప్రారంభించగానే.. గది బయటే కాపు కాస్తున్న మహిళలు తలుపును కొడుతూ నన్ను గదమాయిస్తున్నారు. "హే.. చప్పుడు చేయకుండా భర్తకు సహకరించు" అంటూ బెదిరిస్తున్నారు.
 
అలా బెదిరించేవారిలో మా అమ్మ, అత్తమ్మలు కూడా ఉన్నారు. శోభనం ప్రశాంతంగా జరిగిందా? లేదా అని తెలుసుకోవడంతో పాటు, నవ వధువు కన్యత్వాన్ని పరీక్షించేందుకు అలా మహిళలు గది బయట వేచి ఉండటం మా దగ్గర సంప్రదాయం. వాళ్లు అలా మాట్లాడటం నాకు అవమానకరంగా అనిపించింది. ఇంత క్రూరంగా జరిగేది ఇదేం కాపురం? అనిపించింది" అని ఎల్మీరా గుర్తుచేసుకున్నారు.
 
తొలిరాత్రి తర్వాత బెడ్‌షీట్‌ను వీధుల్లో అందరికీ చూపిస్తారు
నవ దంపతులు శోభనం గదిలోకి వెళ్లాక కొంతసేపు చాలామంది మహిళలు ఉండి వెళ్తారు. ఒక మహిళ (ఎంగి) మాత్రం రాత్రంతా అక్కడే కాపలా ఉంటారు. తొలిరాత్రికి సంబంధించి నవ వధువుకు ఏవైనా సందేహాలు ఉంటే తీర్చేందుకు అనుభవం కలిగిన వివాహితను అలా కాపలాగా ఉంచుతారు. కొత్త పెళ్లి కూతురికి సలహాలు ఇవ్వడంతో పాటు, మరుసటి రోజు ఉదయాన్నే శోభనం గదిలోని బెడ్‌షీట్‌ను తీసుకెళ్లి కుటుంబ పెద్దలకు, గ్రామస్థులకు చూపించడం కూడా ఆ మహిళ (ఎంగి)దే బాధ్యత.
 
రక్తపు మరకలు
ఆ బెడ్‌షీట్ మీద రక్తపు మరకలు కనిపిస్తే ఆ నవ వధువు కన్యత్వానికి గుర్తుగా భావిస్తారు. మరకలు కనిపించగానే అందరూ నవ దంపతులకు అభినందనలు చెబుతారు. ఒకవేళ మరకలు కనిపించలేదంటే... ఇక ఆ వివాహ బంధానికి దాదాపు ముగింపు పడినట్లే లెక్క.
"ఆ తెల్లని బెడ్‌షీట్ మీద మరకలు కనిపించకపోతే నవ వధువును పుట్టింటికి పంపించేస్తారు. అందరూ ఆమెను విడాకులు తీసుకున్న మహిళగా చూస్తారు. రెండో పెళ్లి చేసుకోవడమూ కష్టమే. పుట్టింట్లోనూ తీవ్రమైన వేధింపులు ఉంటాయి" అని అజర్‌బైజాన్‌లో మహిళా హక్కులపై అధ్యయనం చేస్తున్న షక్లా ఇస్మాయిల్ వివరించారు.
 
"భయం, తీవ్రమైన నొప్పి, అవమానంతో ఆ రాత్రి నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనిది. ఆ రాత్రంతా నా కంటికి నిద్రలేదు. ఆయన నా గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కాసేపయ్యాక నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారిన తర్వాత అందరూ మా బెడ్‌షీట్‌ను పరిశీలిస్తారన్న విషయం నాకు ముందే తెలుసు. అలాగే జరిగింది" అని ఎల్మీరా చెప్పారు. ఇలాంటి సంప్రదాయాల కారణంగా ఏటా ఎంతో మంది మహిళలు తీవ్రమైన క్షోభకు గురవుతున్నారని మానసిక వైద్యురాలు ఎల్లడ గోరినా అంటున్నారు. నవ దంపతులను గదిలోకి పంపించి బయట కాపలాగా ఉండటం, బెడ్‌షీట్‌ మీద రక్తపు మరకలను అందరికీ చూపించడం అనాగరికమని గోరినా వ్యాఖ్యానించారు.
 
అజర్‌బైజాన్‌ దేశంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల నేగర్‌కు కూడా ఎల్మీరా లాంటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమెకు శోభనం జరిగినప్పుడు గది ముందు ఒకరిద్దరు కాదు, గ్రామస్థులంతా వచ్చి రాత్రంతా కాపలా కాశారు. "నాకు అప్పుడు 18 ఏళ్లు. వివాహమైన రోజు రాత్రి మమ్మల్ని గదిలోకి పంపించారు. బయట పెద్దఎత్తున జనాలు గుమిగూడారు. వారి మాటలన్నీ మాకు వినిపిస్తున్నాయి. చివరికి వారి శ్వాస చప్పుడు కూడా వినిపిస్తోంది. ఆ పరిస్థితిలో గదిలో ఉన్నంత మాత్రాన మాకు శృంగారం మీద ఎలా ఆసక్తి ఏర్పడుతుంది? నాకు, నా భర్తకు ఇద్దరికీ సెక్సు మీద ఆరోజు ఆసక్తి లేదు. అయినా, తెల్లారితే గ్రామస్థులకు మా బెడ్‌షీట్ చూపించాల్సి ఉంటుంది కాబట్టి అయిష్టంగానే ఆ రోజు శృంగారంలో పాల్గొన్నాం. అయితే, అన్నీ ఆలోచించే మా పెద్దలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారేమో అని అనుకున్నాను" అని నేగర్ చెప్పారు.
 
అజర్‌బైజాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ ఆచారం కారణంగా ఎంతో మంది మహిళల జీవితాలు అంధకారంగా మారుతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. కొన్ని చోట్ల పెళ్లికి ముందే, అమ్మాయిలకు 'నిపుణులతో' కన్యత్వ పరీక్షలు చేయిస్తారు. మహారాష్ట్రలోని కంజర్‌భట్ తెగలోనూ ఈ ఆచారం ఉంది. దీన్ని రూపుమాపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
 
ఈ కన్యత్వ పరీక్షల ఆచారాన్ని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలా చేయడం మహిళలను అత్యంత దారుణంగా అవమానించడమే అని, దీనికి ముగింపు పలకాలని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సమితి పిలుపునిచ్చాయి. వైద్య శాస్త్రంలో వర్జినిటీ (కన్యత్వం) అనే భావనే లేదని ఆ సంస్థలు పేర్కొన్నాయి.
 
"రెడ్ యాపిల్ పరీక్ష"
అజర్‌బైజాన్ పొరుగు దేశాలైన ఆర్మేనియా, జార్జియాతో పాటు, రష్యా పాలనలో ఉన్న ఉత్తర కాకసస్ ప్రాంతంలోనూ ఇలాంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఆర్మేనియాలో శోభనం గది వద్ద ఎవరూ కాపలా ఉండరు. కానీ, బెడ్‌షీట్‌ మీద మరకలను మాత్రం మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పరిశీలిస్తారు. ఈ సంప్రదాయాన్ని 'రెడ్ యాపిల్' అంటారు.
 
ఆర్మేనియా రాజధాని యెరెవాన్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెడ్ యాపిల్ సంప్రదాయం విస్తృతంగా పాటిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో బంధువులను, ఇరుగుపొరుగు ప్రజలను పిలిచి మరీ కొందరు తమ కూతురు 'పవిత్రమైన' అమ్మాయి నిరూపించే ప్రయత్నం చేస్తారని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
 
అర్ధరాత్రి తీసుకెళ్లారు
కన్యత్వ పరీక్షల పేరుతో కలిగే క్షోభ ఒక్కరోజుతో పోయేది కాదని, అది అనేక ఏళ్లపాటు మహిళలను వెంటాడుతుందని మానసిక వైద్యురాలు ఎల్లడ గోరినా అంటున్నారు. "ఓసారి ఒక జంటకు వివాహమైన తర్వాత తొలిరాత్రి బెడ్‌షీట్ మీద రక్తపు మరకలు కనిపించలేదు. దాంతో, అర్ధరాత్రి అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులు నవ వధువు కన్యత్వాన్ని పరీక్షించేందుకు హుటాహుటిన వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు" అని గోరినా గుర్తు చేశారు.
 
వివాహమైన తర్వాత ఆరు నెలలకే ఎల్మీరా భర్త చనిపోయారు. తొలిరాత్రి అనుభవాలను గుర్తు చేసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలని అనిపించడంలేదని ఆమె అంటున్నారు. "రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. ఓ వ్యక్తిని కూడా చూశాను. కానీ, నా గత అనుభవం నన్ను వెనక్కి లాగుతోంది" అని ఆమె చెప్పారు. అయితే, ఈ కన్యత్వ పరీక్షల సంప్రదాయానికి ముగింపు పలకాలన్న అవగాహన యువతలో క్రమంగా పెరుగుతోందని ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాలకు చెందిన విశ్లేషకులు చెబుతున్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదేళ్ల పాటు ఉపయోగించవచ్చు.. మహిళలకు ఉచితంగా ఐదువేల మెన్‌స్ట్రువల్ కప్స్