కుటుంబ పోషణకు డబ్బులు ఎంతో అవసరం. అయితే అవసరానికి మించి ఆశపడితే ఎన్ని అనర్థాలో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పనే చేసింది ఓ భార్య. ఇష్టానుసారం అన్నీ కొనేసి భర్తను అప్పుల్లోకి నెట్టి చివరకు అతని ప్రాణాల మీదకు తెచ్చింది. వారిది తీపి, పులుపు కలిసిన సంసారం. గొడవలు పడినా నీటి బుడగలుగా తేలిపోయేవి.
దంపతులు అంటే ఇలా ఉండాలి అన్న ఇరుగుపొరుగు వారి భావన. అది సైబరాబాద్ లోని రాజేంద్రనగర్. రాజేంద్రప్రసాద్, జమున భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు 6వ తరగతి, మరొకరు 4వ తరగతి, ఇద్దరూ హాస్టల్‌లోనే ఉంటున్నారు.
దీంతో భార్యాభర్తలిద్దరే ఇంట్లో ఉండేవారు. రాజేంద్రప్రసాద్ స్థానికంగా మార్కెటింగ్ బిజినెస్. రాజేంద్రప్రసాద్‌కు సొంత ఇల్లు ఉంది. తండ్రి సంపాదించిన ఆస్తి అది. భార్య జమునకు ఆశ ఎక్కువ. ఇరుగుపొరుగు వారు ఇంట్లో ఏ సామాన్లు కొంటే అదే కొనాలంటుంది. ఖరీదైన పట్టుచీరలు, సామాన్లను భర్త దగ్గర కొనిచ్చేది. భర్తకు వచ్చే జీతం కన్నా అంతకు రెండు రెట్లు ఎక్కువగా అప్పులు చేసి మరీ సామాన్లను కొనిచ్చేది జమున.
ఇలా ఆ అప్పులు కాస్తా సంవత్సరన్నరలో 6లక్షలకు పైగానే చేరింది. దీంతో అప్పుల వాళ్ళు రాజేంద్రప్రసాద్‌ను పీడించడం ప్రారంభించారు. ఇక ఉన్న ఆస్తి ఇంటిని అమ్మి డబ్బులు ఇద్దామని నిర్ణయించుకున్నాడు రాజేంద్ర. అయితే అందుకు జమున ఒప్పుకోలేదు. ఉన్న ఇల్లు అమ్మేస్తే ఎలా అని ప్రశ్నించింది. ఎలాగోలా జమునను ఒప్పించి ఇల్లును తన స్నేహితుడికే అమ్మేశాడు రాజేంద్ర.
స్నేహితుడు కావడంతో డబ్బును ఇచ్చి ఆ ఇంట్లోనే బాడుగ ఉండమని చెప్పాడు అతని స్నేహితుడు. దీంతో ఆ ఇంట్లోనే కొన్ని రోజుల పాటు ఉంటూ వచ్చారు. అయితే ఇంటిని అమ్మిన డబ్బును జల్సా చేసేసింది జమున. మొత్తం డబ్బును ఖర్చు చేసేసింది. అద్దెను కట్టే పరిస్థితి లేక ఆర్థిక సమస్యల్లో సతమతమవుతూ వచ్చారు రాజేంద్రప్రసాద్.
దీంతో జమునకు ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో దొంగలు పడ్డారని, మనల్ని కొట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని అందరినీ నమ్మిద్దాం. దొంగలెవరంటే మన ఇంటిని కొన్నవారేనని చెబుదాం. దీంతో మనకి భయపడి కొన్నిరోజుల ఇదే ఇంట్లో మనల్ని ఉండనిస్తారని భర్తకు చెప్పింది. ఇలా చెబుతూ చెబుతూనే భర్తను రోకలితో తలపై కొట్టింది. వంటగదికి వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి హాల్‌లో తన చేతిని కోసుకుంది జమున.
ఇక అరవడం మొదలుపెట్టింది. స్థానికులు అక్కడి వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు. జమున అనుకున్న విధంగానే చెప్పింది. నాలుగురోజుల పాటు పోలీసులు విచారణ జరిపారు. సి.సి.కెమెరాల్లో దుండగులు ఎవరూ రాలేదని.. ఇదంతా భార్యాభర్తలు ఆడుతున్న నాటకమని తెలుసుకుని గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం ఒప్పేసుకున్నారు జమున, రాజేంద్రప్రసాద్. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.