భార్య వేధింపులు తాళలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఈఘటన దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో జరిగింది. శ్రీనాథ్ (39) అనే టెక్కీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. ఈయన పలు బ్యాంకుల్లో అప్పుచేసి ఓ సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. అదేక్రంలో ఓ యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత నుంచి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. భార్య నిత్యం చేస్తున్న దుబారా ఖర్చులు, వేధింపులు అతనికి మానసిక స్థిమితం లేకుండా చేశాయి. పైగా ఇంటిని తన తండ్రి పేరున మార్చాలంటూ భార్య నుంచి నిత్యం ఒత్తిడి చేయసాగింది.
ఈ వేధింపులతో ఆ టెక్కీ విసిగిపోయాడు. తాను తనువు చాలిస్తేగాని తన విలువేమిటో ఆమెకు తెలిసిరాదనుకున్నాడేమో. ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ప్రాథమిక ఆధారాల మేరకు భార్య, ఆమె తల్లిదండ్రులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు.