చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారు ఎక్కువవుతున్నారు. దెయ్యాన్నో లేక వన్య మృగాలను చూసి చాలామంది భయపడుతుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళకు చీమలంటే భయం. ఆ చీమల భయానికి ఈ లోకాన్ని వదలి తిరిగి రాని లోకాలకు చేరుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలకు చెందిన 25 ఏళ్ల మనీషాకు మూడేళ్ల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి అంబిక అనే మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఉద్యోగ రీత్యా శ్రీకాంత్, మనీషా రెండున్నర ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ పరిధిలోని నవ్యా హోమ్స్‌కు షిఫ్ట్ అయ్యారు.
అప్పటి నుంచి అక్కడే నివాసముంటున్నారు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలు అంటే విపరీతమైన భయం. దీంతో ఆ భయం కాస్త ఎక్కవ కావడంతో అది మైర్మేకో ఫోబియా అనే మానసిక వ్యాధికి దారితీసింది. ఈ వ్యాధికి సంబంధించి గతంలోనే మనీషా పలు కౌన్సిలింగ్‌లు తీసుకుంది. కానీ ఆ భయం ఆమెను వీడలేదు.
దీంతో ఇక బతకడం వీలు కాదనుకున్న ఆ వివాహిత కన్నబిడ్డ, కట్టుకున్న భర్తను గురించి కూడా ఆలోచించకుండా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఇంటికొచ్చి చూసిన భర్త శ్రీకాంత్.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పోర్టుమార్టంకు పంపించి.. ఆమె చనిపోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో చీమలంటే భయంతోనే చనిపోతున్నానని, అన్వి జాగ్రత్త అని రాసి వుంది. ఇంకా అన్నవరం, తిరుపతికి 1116 రూపాయలు చెల్లించాలని.. ఎల్లమ్మకు ఒడిబియ్యం ఇవ్వడం మర్చిపోవద్దు అని మృతురాలు రాసి వున్నట్లు పోలీసులు తెలిపారు