భారతదేశంపై ప్రతీకార టారిఫ్‌లతో అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి అక్కడి ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టేసారు. మేయర్ ఎన్నికల్లో ఊహించని షాక్ ఇచ్చారు. ప్రధాన నగరాల్లో ప్రత్యర్థి పార్టీకి చెందిన డెమొక్రాట్లు విజయం సాధించారు. వారిలో భారతదేశ మూలాలున్న, తెలంగాణలోని మలక్ పేటలో పుట్టిన గజాలా హష్మీ కూడా వున్నారు. ఆమె తన ఎన్నికల పర్యటనలో ట్రంప్ విధానాలపై విరుచుపడ్డారు.
అమెరికా అభివృద్ధని అడ్డుకోవడమే కాకుండా ఆర్థిక సంక్షోభంలో నెట్టేసే చర్యలు తీసుకుని నాశనం చేస్తున్నారంటూ ట్రంప్ పైన ఆమె మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇస్తే మరింత నాశనం చేస్తారని ఆమె చెప్పిన మాటలను అక్కడి ప్రజలు విశ్వసించారు. దాంతో ఆమె ఎన్నికల్లో గెలుపొంది వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నరుగా ఎన్నికయ్యారు.
ఐతే డెమొక్రాట్ల గెలుపుపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ పేజీలో కామెంట్ చేసారు. తమ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్ పేపర్లపై తన ఫోటో లేకపోవడం వల్లనే పరాజయం పాలయ్యారని పేర్కొన్నారు. షట్ డౌన్ కూడా ఓ కారణమైందంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు
ఉచిత పథకాలు సంపన్న దేశాల్లో కూడా పనిచేస్తాయని నిరూపించారు భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్‌దాని. న్యూయార్క్ ఎన్నికల పర్యటనల సందర్భంగా జోహ్రాన్ తనదైన శైలిలో ఉచిత పథకం హామీ ఇచ్చారు. తాము గెలిస్తే న్యూయార్క్ లోని అన్ని నగర బస్సులలో ప్రయాణం ఉచితంగా ప్రకటిస్తామంటూ భారీ హామీ ఇచ్చారు. ఆయన ప్రత్యర్థి ఈ ఉచిత పథకానికి నో చెప్పారు
పైగా స్వయంగా జోహ్రాన్ ను ఓడించేందుకు అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. కాలికి బలపం కట్టుకుని వీధిల్లో ప్రచారం చేసారు. ఐనా న్యూయార్క్ ప్రజలు ఆయన్ను ఛీకొట్టారు. అనూహ్యంగా జోహ్రాన్ విజయం సాధించడంతో ఇక ఇప్పుడు ట్రంప్ ఇగో బాగా హర్ట్ అయ్యిందంటున్నారు. ఐతే ఈ గెలుపు ఊపుతో ట్రంప్ ఒంటెద్దు పోకడకు కళ్లెం వేస్తామంటున్నాడు జోహ్రాన్.
ఈ జోహ్రాన్ మరెవరో కాదు సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు. భారత సంతతికి చెందిన ఈ 34 ఏళ్ల యువకుడు అత్యంత చిన్నవయసులోనే మేయర్ పదవిని చేపట్టబోతున్నాడు.