Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దావోస్ వేదికగా తెలంగాణాకు పెట్టుబడుల వెల్లువ

revanth in davos

వరుణ్

, గురువారం, 18 జనవరి 2024 (10:32 IST)
దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణాలో ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అనేక మంది పెట్టుబడిదారులు తెలంగాణాలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఫలితంగా బుధవారం రికార్డు స్థాయిలో ఒప్పందాలు జరిగాయి. మొత్తం రూ.37,870 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. 
 
ఇందులో అదానీ గ్రూప్‌ పెట్టుబడి రూ.12,400 కోట్లు, రూ.9 వేల కోట్లతో జిందాల్‌ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు, రూ.8వేల కోట్లతో ‘గోదీ’ లిథియం గిగా ఫ్యాక్టరీ, రూ.5200 కోట్లతో వెబ్‌వెర్క్స్‌ డేటా సెంటర్‌, రూ.2 వేల కోట్లతో ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విస్తరణ, రూ.వెయ్యి కోట్లతో గోద్రెజ్‌ కెమికల్‌ ప్లాంట్‌, 270కోట్లతో ఖమ్మంలో పామాయిల్‌ సీడ్‌ గార్డెన్‌ ఇలా అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ పరిశ్రమలకు రాష్ట్రానికి వస్తే 30 వేల పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 
 
అలాగే, గోదీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో గిగాస్కేల్‌ బ్యాటరీ సెల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించి రూ.8 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌లో గంటకు 12.5 గిగావాట్ల సామర్థ్యముండే బ్యాటరీ సెల్‌ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. 
 
ఈ మేరకు గోదీ ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్‌ గోదీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 6వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ముందుగా 2.5గిగావాట్ల కెపాసిటీ సెల్‌ అసెంబ్లింగ్‌ లైన్‌ తయారు చేసి, రెండో దశలో 10గిగావాట్లకు విస్తరిస్తారు.
 
గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాదిర్‌ గోద్రెజ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా తెలంగాణలో గోద్రెజ్‌ గ్రూప్‌ అడుగుజాడలను బలోపేతం చేసేందుకు నాదిర్‌ గోద్రెజ్‌ ఆసక్తి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ.270 కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. గోద్రెజ్‌ గ్రూప్‌ ఇటీవలే మలేసియా ఆయిల్‌ పామ్‌ దిగ్గజం సిమ్‌ డార్బీతో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 
 
ఈ భాగస్వామ్యంలో భాగంగా గోద్రెజ్‌.. భారతదేశంలోని మొట్టమొదటి వాణిజ్య ఆయిల్‌ పామ్‌ సీడ్‌ గార్డెన్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేయనుంది. ఏటా 7మిలియన్‌ పామాయిల్‌ మొక్కలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మిలియన్‌ ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే 1000 కోట్ల కెమికల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని గోద్రెజ్‌ చైర్మన్‌ ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్సు దొంగతనం చేసిన ప్రయాణికుడు... పట్టుకుని రైలుకు వేలాడదీశారు...