అధికారంలోకి వచ్చేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణ హామీని ఎన్నికల్లో ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేస్తున్నాయి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఈ తరహా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 8వ తేదీన జారీ చేసిన జీవో 47ను సవాల్ చేస్తూ ఎ.హరేందర్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. "కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది వివక్షతో కూడిన నిర్ణయం. ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి" అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. రిజిస్ట్రీ నోటిఫై చేస్తే మాత్రం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.