తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో స్కూల్ టాపర్‌గా నిలిచిన ఓ బాలిక... ప్రాణాలు కోల్పోయింది. ఈ ఫలితాల వెల్లడికి 13 రోజుల క్రితమే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గుండెలావిసెలా రోదిస్తున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి, రజిత అనే దంపతులకు ఆకుల నాగచైతన్య అనే కుమార్తె ఉండగా, అదే పాఠశాలలో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తోంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పరీక్షల్లో ఉత్సాహంగా హాజరైంది. అలా పరీక్షలు పూర్తయిన 13 రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది.
చివరికి ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 17వ తేదీన చనిపోయింది. అయితే, బుధవారం వెల్లడైన పరీక్షా ఫలితాల్లో ఆమె 600 మార్కులకుగాను 510 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. కానీ, ఆ సంతోషాన్ని పంచుకునేందుకు తమ కుమార్తె లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలావిసెలా రోదిస్తున్నారు.