హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు హిమాయత్ నగర్ శాఖ భవనంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని భవనం లిఫ్టులో వదిలి పరారయ్యారు. ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బందికి లిఫ్టులో మృతదేహం కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు పలు సూచనలు చేసారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అత్యంత కిరాతకంగా ఈ హత్య జరిగిందని, పాత కక్షల కారణంగానే హత్య జరిగివుంటుందని భావిస్తున్నారు. మృతుడుకి సంబంధించిన వివరాలు, హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.