తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తున్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. 2023 సెప్టెంబరు నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. అయితే, గత 2023 అక్టోబరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఈ మెగా డీఎస్సీ నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో 2023 డిసెంబరు 30వ తేదీ రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష చేశారు. ఇందులో ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో స్కూల్ ఉండాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20,740 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డీఎస్సీ నిర్వహణ విషయమై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. సీఎంగా కేసీఆర్ ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో గత యేడాది మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే, ఇది నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. తొమ్మిదిన్నరేళ్లు ఖాళీగా ఉండి, ఎన్నికల సమయంలో హడావుడిగా నోటిఫికేషన్ జారీచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీని చిత్తుగా ఓడించారు.