తన ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చివరకు విగతజీవిగా మారాడు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి మరొకరితో నిశ్చితార్థం జరగడాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దొంచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి లండన్‌లో టెక్కీగా పని చేస్తున్నాడు. ఈయనకు ఏరుగట్ల గ్రామానికి చెందిన అఖిలను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయంపై ఇరు కుటుంబాల సభ్యులతో మాట్లాడి, వివాహం చేసుకోవడానికి శ్రీకాంత్ రెడ్డి లండన్ నుంచి గ్రామానికి వచ్చాడు. అయితే, అఖిలకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన ప్రియురాలు చేసిన పనిని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఏరగట్ల గ్రామంలో మృతదేహాన్ని పోలీస్ వాహనంపై ఉంచి నిరసన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.