సాధారణంగా దొంగలను చూస్తే మహిళలు ఆమడ దూరం పారిపోతారు. అయితే 13 ఏళ్ల బాలిక ఓ దొంగకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చింతల్‌భగత్ సింగ్ నగర్‌లో పట్టపగలే ఓ దొంగ తాళం వేసిన ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. దీన్ని చూసిన 13ఏళ్ల బాలిక భవాని దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
బాలికను చూడగానే దొంగ పరుగులు తీయడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ భవానీ అతడిని వదలక అతనిని పట్టుకునేందుకు పరుగులు పెట్టింది. ప్రాణాలకు తెగించి మరీ అతడిని వెంబడించింది. భవానీ అడ్డుకోవడంతో దొంగ చోరీ చేయకుండానే పారిపోయాడు.
చుట్టు పక్కన ఎవరూ లేకపోయినా.. భవానీ ఎంతో ధైర్యంతో దొంగను ఎదురించింది. ఈ బాలిక ధైర్య సాహసాలపై కాలనీ వాసులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.