ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అభినందనలు తెలిపానని ప్రధానమంత్రి నరేంద్ర మోడి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. ఇంకా ఆయన పేర్కొంటూ... చంద్రబాబు గారి భవిష్యత్తు దృక్పథం మరియు సుపరిపాలన పట్ల నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా ఉన్నాయి. 2000ల దశకం ప్రారంభంలో మేమిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుండి, అనేక సందర్భాల్లో చంద్రబాబు గారితో కలిసి పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చంద్రబాబు ఈ మైలురాయిని చేరుకున్నారు. 1995లో టీడీపీలో అంతర్గత సమస్యల తర్వాత చంద్రబాబు తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి, ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఎందుకంటే ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశంలో, కరుణానిధి, రంగస్వామి మాత్రమే 15 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.
ఈ జాబితాలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు చేరారు. కొత్త కొత్తగా రాజకీయ నేతలు వస్తున్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ మళ్లీ ప్రజల చేత ఎన్నికవడం ద్వారా చరిత్ర సృష్టిస్తూనే ఉన్నారు. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడం గమనార్హం. ఏపీ సీఎంగా చంద్రబాబు ఈ పదవీకాలం పూర్తి చేసే సమయానికి, ఆయన ముఖ్యమంత్రి పదవిలో 19 సంవత్సరాలు పనిచేసినట్లవుతుంది. ఇది కూడా ఒక రికార్డు అవుతుంది.