కాలేజీల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు కఠిన చట్టాలు వున్నప్పటికీ.. మళ్లీ మళ్లీ ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. యువ ఇంజినీరింగ్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ర్యాగింగ్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక జాదవ్ సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి తేజను సీనియర్లు, స్థానిక యువకులతో కలిసి కొట్టి, బార్‌కు తీసుకెళ్లి రూ.15 వేల బిల్లు చెల్లించాలని వేధించారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి తేజ తన తండ్రికి వీడియో పంపి హాస్టల్‌లో ఉరివేసుకున్నాడు. ఉరేసుకునేందుకు ముందు తాను బలవన్మరణానికి పాల్పడేందుకు ర్యాగింగ్ కారణమని పేర్కొన్నట్లు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇకపోతే.. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చరీకి తరలించారు. ర్యాగింగ్ కారణమా లేక వేరే కారణాలా అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.