జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికకు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా పోలింగ్ జరిగేలా చూసేందుకు భారత ఎన్నికల కమిషన్‌ను కేంద్ర భద్రతా దళాలను మోహరించాలని బీఆర్ఎస్ గురువారం డిమాండ్ చేసింది. రాష్ట్ర పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని, పోలీసులు ఎన్నికలను పారదర్శకంగా జరుపుతారనే నమ్మకం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని బీఆర్ఎస్ ఇప్పటికే ఈసీని కోరిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భగా బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులపై ఈసీ పక్షపాతంగా పనిచేస్తోందని, చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులపై ఆంక్షలు విధించడానికి తొందరపడిన కమిషన్, ఏదో కారణం చేత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్య తీసుకోవడానికి నిరాకరించిందని వినోద్ కుమార్ తప్పుబట్టారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన ప్రచార ప్రసంగాల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలు ఆగిపోతాయని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారని వినోద్ అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు ఓటు వేస్తే తాను నియోజకవర్గాన్ని సందర్శించబోనని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ చెప్పడం ఎన్నికల ఉల్లంఘన కాదా? అని అడిగారు. ఈ వ్యవహారంపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఈసీ ఈ అంశాలపై ఎందుకు మౌనంగా ఉంది? వినోద్ కుమార్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.