టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020 క్రీడల్లో భారత దేశానికి బంగారం పతకం సాధించి పెట్టిన అథ్లెట్ నీరజ్ చోప్రా ఇపుడు జావెలిన్ త్రోలో ప్రపంచ అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే తొలి ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందించి రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. ఇపుడు అథ్లెటిక్స్ మెన్స్ జావెలిన్ త్రోలో అత్యుత్తమ ప్రపంచ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడానికి ముందు 16వ ర్యాంకులో ఉన్న అతడు.. ఇప్పుడు 14 స్థానాలు ఎగబాకి ప్రపంచ రెండో ర్యాంకర్‌గా నిలిచాడు.
1315 పాయింట్లతో ఉన్న నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. 1396 పాయింట్లతో జర్మనీకి చెందిన జొహానస్ వెట్టర్ మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2021లో దాదాపు 7 సార్లు బల్లేన్ని 90 మీటర్ల కన్నా ఎక్కువ దూరం విసిరిన అతడు తొలి స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్‌లో వెట్టర్ కే గోల్డ్ వస్తుందని అంతా భావించారు.
కానీ, అతడు నీరజ్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఒలింపిక్స్‌లో 90 మీటర్ల దూరం ఖాయం అని అనుకున్నా.. కేవలం 82.52 మీటర్ల దూరమే విసిరి 9వ స్థానంలో నిలిచాడు. కనీసం రజతం, కాంస్య పతకాలనూ అతడు సాధించలేకపోవడం గమనార్హం.