ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణపతకం సాధించిన పెట్టిన హీరో నీరజ్ చోప్రా. దేశానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్‌కు ఇపుడు దేశంలో వీరాభిమానులు ఎక్కువైపోయారు. దీంతో ఆయన పేరుమీద దానధర్మాలు చేస్తున్నారు. తాజాగా నీరజ్ అనే పేరున్న వారికి ఉచితంగా పెట్రోల్ పోస్తున్నారు.
నీరజ్ బంగారం పతకం సాధించిన శుభసందర్భంగా నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ పెట్రోల్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ఓ బంక్ యజమాని ముందుకొచ్చాడు. నీరజ్ చోప్రా మీద అభిమానంతో ఆ బంక్ యజమాని ఇలా చేస్తున్నాడు.. గుజరాత్‌లోని బారుచ్ జిల్లా నేత్రంగ్ టౌన్‌లోని ఇండియన్ ఆయిల్ బంక్ యజమాని ఈ ఆఫర్ ప్రకటించాడు.
వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత ఆటగాడు నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నీరజ్ చోప్రా మాత్రమే కాదు.. నీరజ్ పేరు ఉన్న వారందరూ ఆ సంతోషాన్ని అనుభవించాలని సదరు బంక్ యజమాని ప్లాన్ చేశాడు. 501 రూపాయల విలువైన పెట్రోల్‌ను నీరజ్ పేరు కలిగిన వారందరికీ ఉచితంగా ఇస్తానని బోర్డు పెట్టాడు.
అదివారం ఉదయం నుంచి ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల వరకు నీరజ్ పేరు కలిగిన బారుచ్ జిల్లా వాసులందరికీ ఆ ఆఫర్ వరిస్తుందని పేర్కొన్నాడు. ఏదైనా అధికారిక ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లి తమ పేరు నీరజ్ అని నిరూపించుకుంటే చాలు వారికి 501 రూపాయల విలువైన పెట్రోల్ ఫ్రీ. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీరజ్ పేరున్న వ్యక్తులందరూ ఆ పెట్రోల్ బంక్ ముందు క్యూ కడుతున్నారు.