టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత అథ్లెటిక్స్ రంగంలో హర్యానా కుర్రాడు నీరజ్ చోప్రా ఇప్పుడో సరికొత్త సంచలనంగా మారాడు. ఈ పోటీల్లో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాడు. తద్వారా ఒలింపిక్ చరిత్రలోనే అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించిన ఘతను సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ ఆర్మీ మ్యాన్‌పై నజరానాల వర్షం కురుస్తోంది.
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తమ కంపెనీ తయారు చేసిన వాహనాన్ని నీరజ్ చోప్రాకు బహూకరించనున్నట్టు తెలిపారు. చోప్రా టోక్యోలో బంగారు పతకం గెలిచిన తర్వాత ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు.
ఓవైపున టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ బాహుబలి చిత్రంలో ఈటెను పట్టుకుని గుర్రంపై వస్తున్న ఫొటో, మరో పక్కన జావెలిన్ త్రో విసురుతున్న నీరజ్ చోప్రా ఫొటోను ఆయన పంచుకున్నారు. నీరజ్ చోప్రాను బాహుబలిగా అభివర్ణించారు. మేమంతా నీ సైన్యంలో ఉన్నాం అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ, నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్ యూవీ-700 వాహనం కానుకగా అందించాలని సూచించాడు. అందుకు వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా... ఎక్స్ యూవీ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలంటూ తన సంస్థ ఉద్యోగులను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.